Srisailam | శ్రీశైలం : వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో నిండిపోయాయి. ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. శ్రీశైలం స్విచ్ యార్డ్ వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో.. ఆ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తమ వాహనాలను ఎక్కడంటే అక్కడ ఆపడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. దిగువకు లక్షా 33 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 199.73 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్‌కు 65,824 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.