హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే మూడ్రోజులుగా చిరుజల్లులతో నగరం తడిసిముద్దవుతున్నది. కాగా, వాతావరణ శాఖ సూచనతో వానాకాల ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 040-29555500 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు
కాగా, నగరవాసులు మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కార్పొరేటర్లు డివిజన్లలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలన్నారు. సహాయం కోసం 2111 1111 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు.
నగరంలో శనివారం సాయంత్రం ఆదివారం ఉదయం వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. గత రెండ్రోజుల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగరవ్యాప్తంగా చిరుజల్లులతో రహదారులపై జనం రద్దీ తగ్గిపోయింది.