హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అకడకడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరంలో కొనసాగుతున్నదని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నదని తెలిపింది.
ఫలితంగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఆదివారం తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. పశ్చిమ దిశగా ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నదని తెలిపింది.