ఆస్ట్రేలియా: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ , ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపై జరుగుతున్న చర్యలను ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా (NRI BRS Australia ) శాఖ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నల్ల దుస్తులు ధరించి నిరసన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్చార్జ్ అనిల్ బైరెడ్డి ( Anil Baireddy ) మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం , పాలనలో లోపాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలపై పోలీసు చర్యలు, అరెస్టులు, నిర్బంధాలు, శాసనసభ , శాసన మండలిలో సస్పెన్షన్లు తదితర అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను స్వేచ్ఛగా ప్రస్తావించే అవకాశం ఉండాలని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) నివాసం ఎర్రవెల్లిలో దాడులు , ఆయనకు సంబంధించిన భద్రతా అంశాలపై కూడా ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రవాసులు రాష్ట్రంలోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం , చట్టబద్ధ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రమేష్ ముత్యాల, రాహుల్ నడిదె, సత్య గుండా ,రవీందర్ చుక్కా, కార్తీక్ ,రమణ, చందు పాల్గొన్నారు.