పనాజీ: ముంబై-గోవా రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యంపై తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. అందుకే ఆ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోనని ఆయన అన్నారు. (Nitin Gadkari) గోవా రాజధాని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ వద్ద ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ను కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్, పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. ముంబై-గోవా రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ముంబై-గోవా హైవే పనులు ఇంత ఆలస్యం కావడం నాకు సిగ్గుగా అనిపించింది. అందుకే దాని ప్రారంభోత్సవానికి నేను రానని ముందే ప్రకటిస్తున్నా’ అని అన్నారు.
మరోవైపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం, నాసిరకం పనులకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు చేపడతానని నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ‘ఒక సంవత్సరంలోపే అత్యధిక సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటా. అధికారులను సస్పెండ్ చేసి ఒక రికార్డు సృష్టించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను దీన్ని ఆపబోను’ అని అన్నారు.
అలాగే అక్టోబర్‌లో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గంలో గోవాకు ప్రయాణించి ఆ రహదారిని స్వయంగా తనిఖీ చేస్తానని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆ రహదారి ప్రయాణ సౌకర్యవంతంగా ఉందో లేదో అంచనా వేసి చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
VIDEO | Porvorim: Union Minister Nitin Gadkari (@nitin_gadkari) says that delay in Mumbai-Goa highway shameful, vows action against contractors. “Won’t attend its inauguration,” says Gadkari.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/OnK6q8ZOag
— Press Trust of India (@PTI_News) September 10, 2026