మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/కేసముద్రం : భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహం అధికంగా రావడంతో జిల్లాలోని కేసముద్రం – ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య 418 కిలో మీటర్ రాయి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
సోమవారం డీఆర్ఎం అరుణ్‌కుమార్ జైన్ పర్యవేక్షణలో రైల్వే అధికారులు సుమారు వంద మంది కార్మికులు, ఐదు యంత్రాలతో మర్మమతు పనులు చేపట్టారు. ఐదు ప్రాంతాలలో డ్యామెజీని గుర్తించి 4 ప్రాంతాల్లో పనులు పూర్తి చేసినట్టు డీఆర్ఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం వరకు పునరుద్ధరణ పనులు పూర్తికావాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 10 చోట్ల రోడ్లు కొట్టుకుపోగా, మరో 10 చోట్ల రోడ్డు కోతకు గురైనట్టు ఆర్అండ్బీ అధికారులు గుర్తించారు. వీటి మరమ్మతుకు రూ. 2 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
వర్షాల కారణంగా జిల్లాలో 16,810 ఎకరాల్లో వరి, 5,764 ఎకరాల్లో పత్తి, 2,796 ఎకరాలో మక్కజొన్న, ఇతర పంటలు 2,172 ఎకరాలు, మొత్తం 27,542 ఎకరాల్లో పంటలు నీటి మునిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 675 ఎకరాలల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. మంత్రి సీతకతో పాటు అధికారులు పర్యటించినప్పటికీ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ప్రజలు నిరాశ చెందారు.