నిజామాబాద్, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షానికి జిల్లా చిగురుటాకులా వణికింది. జిల్లా కేంద్రంలోని వందలాది కాలనీలు నీటి మునిగాయి. ప్రజలు దాదాపుగా 40గంటల పాటు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కామారెడ్డి పట్టణంలో 12 అడుగులు ఎత్తుతో వరద ప్రవాహం ఉండటంతో ఎన్జీవో కాలనీ, జీఆర్ కాలనీలు భయానక పరిస్థితిలో కొట్టుమిట్టాడాయి. కామారెడ్డి శివారు ప్రాంతంలో పంట పొలాల మీదుగా తన్నుకు వచ్చిన వరద అంతకంతకు పెరిగి గ్రౌండ్ ఫ్లోర్ భవనాన్ని ముంచెత్తుతూ ముందుకు సాగింది.
కామారెడ్డి పెద్ద చెరువు గతంలో ఎన్నడూ లేని విధంగా అలుగు దుంకింది. పెద్ద చెరువుకు కూత వేటు దూరంలోని నివాసితులు ప్రాణ భయంతో వణికిపోవాల్సి వచ్చింది. ఓ వైపు పెద్ద చెరు వు అలుగు, మరోవైపు ఎగువ మెదక్ జిల్లా అటవీ ప్రాంతం గుండా భారీ వరద పంట పొలాల మీదుగా పరుగులు తీసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 36కు పైగా చెరువులు తెగినట్టుగా ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. అనధికారికంగా మరో 50కి పైగా చెరువులు ప్రమాదపు అంచులో కొట్టుమిట్టాడుతున్నాయి. మంజీరా ఉగ్రరూపం దాల్చడం, నిజాంసాగర్ గేట్లు ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులు వదలడంతో దిగువ అనేక గ్రామాలు ముంపును ఎదుర్కోవాల్సి వచ్చింది.
బొగ్గు గుడిసె సమీపంలో ఎన్హెచ్ పనులు చేస్తున్న 8 మంది బీహార్ కూలీలు, గున్కుల్లో కోళ్ల ఫారంలో ముగ్గురు చిక్కుకోగా రక్షణ దళాలు వారిని సురక్షితంగా కాపాడాయి. రాజంపేటలో గోడ కూలిన ఘటనలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందాడు. దోమకొండలో వరద ధాటికి ఆరు ఆవులు చనిపోయాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండలో రికార్డు స్థాయిలో 43.15 సెం. మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేర్కొన్నారు. పాల్వంచ మండలం ఎల్పుగొండలో 10వేల కోళ్లు వరదలో కొట్టుకుపోయాయి. కోళ్ల ఫారం నేలమట్టమైంది. రూ.30లక్షలకు పైగా నష్టం సంభవించిందని యజమాని ఐలేని నాగేశ్వరరావు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
కామారెడ్డి పట్టణంలో పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. రోడ్డుకు ఇరువైపులా నిలిపిన లారీలు, భారీ వాహనాలు వరద ధాటికి చెల్లాచెదురయ్యాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. కాలనీల్లో వరద తగ్గుముఖం పట్టిన తర్వాత బురదతో నివాసాలు నిండిపోయాయి. చెల్లాచెదురైన వంట సా మగ్రి పనికి రాకుండా పోయాయి. ఎల్లారెడ్డి మండలంలో లక్ష్మాపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది.
లింగంపేట మండలం భవానిపేట్ గ్రామ శివారులో ఎర్రగుంట వద్ద చెక్ డ్యామ్ కొట్టుకుపోగా గ్రామాన్ని తాకుతూ పెద్దవాగు ప్రమాదకరంగా ప్రవహించింది. మెంగారం వద్ద రోడ్డు తెగడంతో లింగంపేట – ఎల్లారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ మార్గంలో చెరువు కట్ట తెగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. నాగిరెడ్డిపేట మండలం లో నడిమితండాలో వరదలో గిరిజనులు చిక్కుకుని బుధవారం ఆర్తనాదాలు చేశారు. కామారెడ్డి మండలంలోని లింగాయిపల్లి శివారులో వరదలో నలుగురు, చిన్నమల్లారెడ్డి చెరువు వద్ద ముగ్గురు చిక్కుకొని సాయం కోసం ప్రాధేయపడగా రక్షించారు.