నమస్తే నెట్వర్క్, మే 27: నైరుతి రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లగా, మరికొన్ని చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని బోరిగామ వాగు పొర్లింది. ఆర్అంబ్బీ రహదారులు బురదమయంగా మారాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంద్రవెల్లి మండలం పోల్లుగూడలో జుగ్నాక్ వంశీయుల కుల దేవత పెర్సపేన్ (పెద్దదేవుడు) ఆలయంపై పిడుగు పడటంతో ఆలయ గోపురం పగిలిపోయి, కలశం ఊడిపోయింది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో లంబాడితండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఎర్రవాగు వంతెన వద్ద నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం సుమారు రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా భారీగా ఉరుములు, మెరుపులతో కురిసింది. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలో పిడుగు పడి దాసరి లక్ష్మణ్ (26) అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. కుండపోతగా వర్షం పడటంతో వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి, రాజన్న ఆలయ పరిసర రహదారులు, జాతర గ్రౌండ్ రహదారులపై వరద నీరు పొంగి ప్రవహించింది.
చందుర్తి మండలంలోని గుడిపేటలోనూ వర్షం కురిసింది. వీర్నపల్లి పెద్దవాగు, గర్జనపల్లి మూలవాగులో ప్రవాహం పెరిగింది. వట్టివాగు ఉధృతికి గర్జనపల్లి, వన్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలువార్డులు వర్షపు నీటితో జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో వర్షం దంచికొట్టింది. మండలంలోని సూరంపేట నుంచి గంగారాంతాండ వెళ్లేరోడ్డులో వాగు ఉప్పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో గంటన్నరకు పైగా భారీ వర్షం పడటంతో పట్టణంలోని పలు వార్డులు, లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించింది.
ఉమ్మడి వరంగల్‌లో మంగళవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ నగరంలో రాత్రి వరకు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి వాననీరు చేరింది. వరంగల్, హనుమకొండలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. హెడ్‌పోస్టాఫీస్ సెంటర్ జలమయం కావడంతో పక్కనే ఉన్న సీకేఎం దవాఖానకు చికిత్స కోసం వచ్చిన గర్భిణులు మోకాల్లోతూ నీటిలో నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో వర్షం దంచికొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలు గ్రామా ల్లో వరద నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట, కేసముద్రం, గూడూరు, బయ్యారంలో వర్షంకురిసింది. ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలుపడ్డారు.