హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో సోమవారం హైదరాబాద్‌తోపాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై మోకాల్లోతు వరదనీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించింది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది.
షేక్‌పేట్‌లో అత్యధికంగా 12.40 సెం.మీ, ఖైరతాబాద్‌లో 11.60 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లో 12.16 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో 10.65 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.