Heavy Rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి. వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతున్నది. వర్షాలతో పలుచోట్ల సింగరేణిలో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. అత్యధికంగా ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వెంకటాపురం తహశీల్ పరిధిలో 25.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ వివరించింది. అతిభారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల వాగులు, వంకల్లో వరద పోటెత్తింది. మంగపేట మండలవ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మల్లూరు, రమణక్కపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వచ్చిన వరద నీరు చేరింది.
ములుగులో ఇండ్లలోకి చేరిన వరద నీరు
కమలాపురంలో విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో లైన్ బ్రేక్ డౌన్ అయ్యింది. దాంతో రాత్రి నుంచి గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే, ఏటూరునాగారంలో 18.4, మంగపేటలో 15.8, అలుబాక(జెడ్)లో 14.9, గోవిందరావుపేటలో 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 14.4, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 11.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో రెండు సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ వివరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం వివరించింది. మరో వైపు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.