హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారాయి. ఈ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవన ద్రోణి బుధవారం రాజస్థాన్ పరిసర ప్రాంతాలలోని అల్పపీడనం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్టు వెల్లడించింది. ఈనెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు ప్రకటించింది.
బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. గురువారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గం టల్లో మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. అత్యధికంగా మెదక్ జిల్లా చేగుంటలో 2.85 సెం.మీ వర్షం కురిసినట్టు పేర్కొన్నది.