హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 26.77 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 9.9 మి.మీ. మాత్రమే. బుధవారం కురిసిన వర్షానికి 20 మండలాల్లో 100 మి.మీ. కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది.
గురువారం ఉదయం 8 గంటల వరకు మెదక్ జిల్లాలోని చేగుంటలో అత్యధికంగా 227.5 మి.మీ. వర్షపాతం, రంగారెడ్డి జిల్లాలోని తట్టి అన్నారంలో 216 మి.మీ., నాగోల్ పరిధిలోని బండ్లగూడలో 212.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ మూడు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 13 ఏరియాల్లో భారీ వర్షం కురవగా, 142 మి.మీ. నుంచి 192 మి.మీ. మధ్య వర్షపాతం నమోదైంది.
జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య రాష్ర్టంలో 369.7 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ సమయంలో సాధారణ వర్షపాతం 236.33 మి.మీ. మాత్రమే. 17 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 60 శాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరో 13 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వరకు వర్షపాతం నమోదు కాగా, మంచిర్యాల, నాగర్కర్నూల్, పెద్దపల్లి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.