హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): భారీ వర్షం రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యధికంగా 17.93 సెంటీమీటర్లు, కాగా మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 17.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ పట్టణంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏకధాటిగా వర్షం కురిసిన వర్షానికి జిల్లా కేంద్రం చెరువును తలపించింది.
ఆయా కాలనీలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో వరద తీవ్రత అధికమైంది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. కుండపోత వర్షానికి పట్టణవాసులు గజగజ వణికిపోయారు. మెదక్ జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి-భువనగిరి, నిర్మల్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాబోయే నాలుగురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వద్ద భారీగా వరద చేరడం తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై అన్ని శాఖల అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.