హైదరాబాద్ సిటీబ్యూరో, హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినా.. వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి ప్రజలు కనీవినీ ఎరుగని నరకాన్ని అనుభవించారు. రోడ్లపై వరద, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంతో దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారు. ఈ సమయంలో కీలకంగా వ్యవహరించే జీహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ, జలమండలి పలు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. దీంతో నగరం నరకాన్ని తలపించింది. రహదారులు చెరువులయ్యాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి.. అమీర్‌పేటలో కార్లు నీట తేలాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ఐటీ కారిడార్‌లో మూడు గంటలపాటు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకున్న ఓ వాహనదారుడు ఒక పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్ చేయగా.. వర్షం పడుతుంది? మేమేమి చేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం వారి పనితీరుకు అద్దం పడుతున్నది. ఇదేం పాలన అంటూ వాహనదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోలీచౌకి నుంచి మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ రోడ్డు పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ వైపు.. కోఠి నుంచి సీబీఎస్, చాదర్‌ఘాట్, మలక్‌పేట, నల్లగొండ ఎక్స్‌రోడ్, దిల్సుఖ్నగర్, కొత్తపేట్, ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. మియాపూర్ జంక్షన్ నుంచి కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ వరకు ట్రాఫిక్ సమస్యతో వాహదారులు సతమతమయ్యారు. నగరంలో చాలా ప్రాంతాల్లో సగటున 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు నల్లగొండ, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువొచ్చు.