రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. 12 గంటలుగా వర్షం పడుతూనే ఉంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ఉప్పొంగుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. గ్రామాల్లోకి కూడా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది.
దేవునిఎర్రవల్లి, తంగడిపల్లి టు అంతప్పగూడ, కుమ్మెర, అంతారం, కౌకుంట్ల, ఆలూరు, పామెన, దేవరంపల్లి తదితర ప్రధాన వాగుల్లోకి వరద కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం మండలంలోని వివిధ వాగులను ఎంపీడీవో రాజ్‌కుమార్, తహసీల్దార్ వైఎస్.శ్రీనివాస్, ఆర్ఐ రాజేశ్ సందర్శించారు. దేవరంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్‌లకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. దేవరంపల్లి సర్పంచి నరహరి రెడ్డి, ఖానాపూర్ సర్పంచి శ్రీలత ప్రభాకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.