హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటన తెలిపింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 13.77 సెం.మీ, తాంసిలో 13.53 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది. రాబోయే 4 రోజులు కూడా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని పేరొన్నది. ఈ అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, దీని ప్రభావంతో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
గురువారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ 13.77 సెం.మీ, తాంసిలో 13.53 సెం.మీ నమోదైనట్టు వివరించింది.