Rain Update | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వచ్చే ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమబెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది.
ఆదివారం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపైకి వరద చేరడంతో, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నగరంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. ముఖ్యంగా మాదాపూర్, హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్, జీహెచ్ఎంసీ సిబ్బంది వాహనదారులను కోరారు. యూసఫ్‌గూడలోని శ్రీకృష్ణనగర్‌లో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది.