ఖిలావరంగల్: వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లడంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తింది. పలు మండలాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యధికంగా సంగెం మండలంలో 178.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖిలావరంగల్లో 155.0 మి.మీ., వరంగల్లో 148.8 మి.మీ., వర్ధన్నపేటలో 125.4 మి.మీ., ఖానాపూర్లో 108.8 మి.మీ. అతి భారీ వర్షం కురిసింది. వర్షపాతం నమోదైంది. అలాగే గీసుగొండలో 90.4 మి.మీ, దుగ్గొండిలో 84.2 మి.మీ, నల్లబెల్లిలో 66.4 మి.మీ, నర్సంపేటలో 86.4 మి.మీ, చెన్నారావుపేటలో 85.4 మి.మీ, రాయపర్తిలో 90.8 మి.మీ, పర్వతగిరిలో 88.6 మి.మీ, నెక్కొండలో 82.4 మి.మీ భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లా మొత్తం సగటు వర్షపాతం 107.0 మి.మీగా నమోదైంది.
ఖిలావరంగల్ అగడ్త చెరువు ప్రమాదకర స్థాయిలో నిండిపోయింది. రిటర్నింగ్ వాల్ పైవరకు నీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ధాటికి చెరువు వెనకాల ఉన్న సుమారు 100 ఎకరాల పంటలు నీటమునిగాయి. ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖిలా వరంగల్ చెరువు పొంగిపొర్లుతుండడంతో ఆ నీరంతా శివనగర్, మైసయ్య నగర్లో లోతట్టు ప్రాంతాల నీట ముంచాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎవరు లేకపోవడంతో ఒక కారు నీటిలో మునిగిపోయింది. అదృష్టవశాత్తూ, స్థానికులు వెంటనే స్పందించి జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. అధికారుల నుంచి సకాలంలో ఎలాంటి సహాయక చర్యలు అందలేదని స్థానికులు వాపోతున్నారు.
వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై అక్కడక్కడ నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో భారీ వాహనాలు మినహా బైకులు, ఆటోలు, కార్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే బొల్లికుంట చెరువు అలుగు పోస్తుండడంతో గుంటూరు పల్లి, బొల్లికుంట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయి చెరువులను తలపింప చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ రైల్వే స్టేషన్ కు భారీగా వరద పోటెత్తింది. ఒకటి, రెండవ ప్లాట్ ఫామ్ ల మధ్య పట్టాలు కనిపించినంత వరద నీరు చేరింది. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Warangal Colony