బయ్యారం: ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. గాలుల కారణంగా మండలంలోని కొత్తపేట, బయ్యారం, బాలాజీ పేట, వెంకట్రాంపురం, జగ్గు తండా, బంజర తండా, నామలపాడు, నర్సాతండా ఉప్పలపాడు, మిర్యాల పెంట కంబాలపల్లి, కాచనపల్లివంటి గ్రామాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఇండ్లపై కప్పులు , రేకులు గాలికి కొట్టుకుపోయాయి. ఇల్లందు- మహబూబాబాద్ జాతీయ రహదారి బయ్యారం శివారులో చెట్టు రహదారిపై పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొత్తపేట, ఉప్పలపాడు, బయ్యారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే నష్టపోయామని రైతులు వాపోయారు. ధాన్యం భద్రపరచుకునేందుకు పట్టాలు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. విపరీతమైన గాలి కారణంగా మామిడికాయలు రాలిపోవడంతో కౌలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రంగాపురం ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న 150 ఏళ్ల మర్రి వృక్షం వేర్లతో సహా కూలిపోగా, బయ్యారంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పురాతన మర్రిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల స్తంభాలు, వైర్లు విరిగిపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విద్యుత్ పునరుద్ధరణకు ట్రాన్స్కో సిబ్బంది మరమ్మతులు ప్రారంభించారు. వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని తహసిల్దార్ విజయ, సీఐ రవికుమార్, ఎస్ఐ తిరుపతి పర్యవేక్షించారు.