హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అల్పపీడనాలు సహా ఇటీవల ప్రకృతిలో వస్తున్న మార్పులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. అల్పపీడనాలు ఏర్పడితే భారీ వర్షాలు, వరదలు సంభవించడంతోపాటు ఏకంగా తుఫాన్‌ను తలపిస్తున్నాయి. కుండపోత వానలే కురుస్తున్నాయి. దీంతో అల్పపీడనాలకూ భయపడే పరిస్థితి నెలకొన్నది. దీనికంతటికీ వాతావరణ మార్పులే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అతి భారీ వర్షాలు, వాటి వల్ల సంభవించే బీభత్సం.. తుఫాన్లకు ఏమాత్రం తీసిపోకుండా రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వరద బీభత్సానికి గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్‌లు సంభవిస్తున్నాయి. తకువ వ్యవధిలో, తకువ ప్రాంతంలో అతి భారీ వర్షం ఇటీవల కాలంలో తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల్లో కురుస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీభత్సమే సృష్టించింది. ఇంకా వివిధ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో 24 సెం.మీ, నుంచి 44 సెం.మీ, వర్షపాతం నమోదైంది.
మూడు జిల్లాల్లో వరద బీభత్సం
అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతోనే రెండు రోజుల్లో 60 సెం.మీ. కంటే అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఒక గంటలో 15 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వర్షం పడితే క్లౌడ్ బరస్ట్‌గా చెప్తారు. ఒకవైపు అల్పపీడనం, మరోవైపు నైరుతి రుతుపవనాలు కలవడం కూడా ఈ భారీ వర్షాలకు కారణమైంది. అల్పపీడనం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మేఘాలన్నీ ఒక చోటుకు చేరి కుంభవృష్టిని కురిపించేస్తున్నాయి. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలు భౌగోళికంగా ఎత్తయిన ప్రాంతాలు కావడం తో మేఘాలన్నీ పైన చేరి వర్షించాయని చెప్తున్నారు. వందేండ్లలో కామారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు.
కాలుష్యం, వాతావరణ మార్పులే కారణం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
గాలులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదలడం, గాలుల్లో వ్యత్యాసాల వల్ల అల్పపీడనాలు ఏర్పడతాయి. దీనికి ప్రధాన కారణం పట్టణాలు విపరీతంగా విస్తరించడం, వాహన కాలుష్యం, వేడిమి, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వాతావరణ మార్పులకు అడవుల నరికివేత, పారిశ్రామికీకరణ, కాలుష్య ఉద్గారాలు, పర్వత ప్రాం తాల సమతుల్యాన్ని దెబ్బతీయడం, భూమి వేడెక్కడం కూడ కారణంగా పేర్కొన్నారు.24గంటల్లో మరో భారీ వర్ష సూచన
రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
అల్పపీడనం బంగాళాఖాతంలో దిశ మార్చుకుని.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో 24గంటల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొన్నది. సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్టు వెల్లడించింది.
బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. వర్షాలు కురుసే సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో భద్రాదికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 19.24 సెం.మీ, ఇల్లందులో 15.06 సెం.మీ, చుంచుపల్లిలో 14.76 సెం.మీ, లక్ష్మీదేవిపల్లిలో 12.12 సెం.మీ, ములుగులో 11.62 సెం.మీ, అశ్వారావుపేటలో 11.16 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.