హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 2 గంటలపాటు ఏకధాటిగా కురిసిన కుంభవృష్టితో హైదరాబాద్ అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమాయ్యయి. పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి నీరు చేరింది. కీసర, ఇబ్రహీంపట్నం, దండుమైలారం, నేరేడ్మెట్, మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, సింగపూర్ టౌన్షిప్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 వరకు కీసర మండ లం బండ్లగూడలో అత్యధికంగా 10.1, ఇబ్రహీంపట్నంలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ అధికారులు తెలిపారు.
నేడు, రేపు భారీ వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డైరెక్టర్ నాగరత్న వివరించారు.
ప్రాజెక్టులకు వరద తగ్గుముఖం
గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి గురువారం నాటికి 88 వేల క్యూసెక్కులు రాగా, శుక్రవారం సాయంత్రానికి అది 31 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. నిజాంసాగర్, శ్రీరాజరాజేశ్వర జలాశయం, ఎల్ఎండీ, కడెం ప్రాజెక్టులతోపాటు, పార్వతి, సరస్వతి, లక్ష్మీ, సమ్మక్క బరాజ్‌ల వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇటు కృష్ణాలోనూ వరద తగ్గుముఖం పడుతున్నది. శ్రీశైలం డ్యామ్‌కు గురువారం సాయంత్రానికి 52 వేల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 39 వేలకు పడిపోయింది. జూరాల రిజర్వాయర్‌కు 19 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 11,120 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నాగార్జున సాగర్‌కు 63,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. 2,367 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి 59,730 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.