Hailstorm | నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాళ్ల వాన దంచికొట్టింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో వడగండ్లు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్, మునిపల్లి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. న్యాల్కల్ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి. గద్వాల మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మానవపాడు మండలంలో మిర్చి తడిసిపోయింది. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి శివారులో గొర్రెల కాపరి బాలకృష్ణ(22), పెబ్బేరు మండలం పెంచికలపాడు శివారులో వనపర్తి మండలం చిట్యాలకు చెందిన వంగూరు లక్ష్మి (50), గట్టు మండలం ఆరగిద్ద శివారులో చాకలి జంబన్న పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో చిరుజల్లులు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంతోపాటు కనగల్‌లో 4 సెంటీమీటర్ల వర్షం పడగా మిర్యాలగూడ, నాంపల్లి, మర్రిగూడ, పీఏ పల్లి అనుముల మండలాల్లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మిర్యాలగూడలోని గంట శ్రవణ్‌రెడ్డి ఇంటిపై పిడుగు పడటంతో ఇంట్లోని 9 లక్షల విలువైన సామగ్రి కాలి బూడిదయ్యింది.
శంషాబాద్ రూరల్, మార్చి 16: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా గురువారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాలను దారిమళ్లించిన్నట్టు జీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని విజయవాడకు మళ్లించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరులోనే నిలిపివేశారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని విజయవాడకు తరలించారు.
Heavy Rain
పశ్చిమబెంగాల్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి, దక్షిణ తమిళనాడు నుంచి మధ్య, అంతర్గత కర్ణాటక, గోవా మీదుగా ఉత్తర కొంకణ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా రైతాంగానికి సర్కార్ అండగా నిలిచింది. గురువారం అకాల వర్షం, వడగండతో మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లోని 13 గ్రామాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం వికారాబాద్‌లో పర్యటించనున్నారు.