వరంగల్: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. బట్టలబజార్, పాతబీటుబజార్ రోడ్లపై నీరు నిలిచింది. హంటర్‌రోడ్, ఎన్టీఆర్నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్ సాకరాశికుంట, ఎన్ఎన్నగర్, పలు కాలనీలు నీటమునగడంతో ఇండ్లలోకి నీరుచేరింది. ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్లో ఇండ్లలోకి నీరుచేరింది. దీంతో అక్కడున్న గుడిసెవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.
సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఖిల్లా వరంగల్ ప్రాంతంలో 14.8 సెం.మీ. వర్ధన్నపేటలో 12 సెం.మీ., పర్వతగిరిలో 10.7 సెం.మీ, వరంగల్‌లో 9.5 సెం.మీ., గీసుకొండలో 9.2 సెం.మీ. చొప్పున వర్షపాతం కురిసింది.
మరోవైపు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. బుర్కపల్లి వాగు, గుంజేడుతోపు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ శివారులు రాళ్లతోటి వాగు ఉప్పొంగింది. నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే రోడ్డులో ఉన్న వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న వాగులు దాటవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వరంగల్‌లో మహానగర పాలక సంస్థ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు.
వరంగల్ కలెక్టరేట్- 1800 425 3434, 91542 25936
హనుమకొండ కలెక్టరేట్- 1800 425 1115
వరంగల్ మున్సిపాలిటీ కార్యాలయం- 1800 425 1980, 97019 99676
వరంగల్ విద్యుత్‌శాఖ- 1800 425 0028
కాగా, రానున్న ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.