ఖిలావరంగల్: వరంగల్‌లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్‌బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భారీ వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా ఇద్దరు డ్రైవర్లు అజాగ్రత్తగా నడపడంతో రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఉస్మాన్, నరేష్, సాయి కృష్ణ హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో సుమారు 60 మంది ప్రయాణికులను స్థానికుల సహాయంతో సురక్షితంగా రక్షించారు. చిన్నారులను, వృద్ధులను భుజాల మీద ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్ కాలుకు గాయమై తీవ్రంగా రక్త స్రావం కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు హెడ్ కానిస్టేబుల్ కాలుకు ఆరు కుట్లు వేశారు.
ఆదివారం ఉదయం కురిసిన ఎడతెరిపిలేని వర్షం కారణంగా వరంగల్‌లోని రైల్వే అండర్‌బ్రిడ్జి కిందకి భారీగా వరద నీరు చేరింది. అయితే, డ్రైవర్ల అత్యుత్సాహంతో రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలోకి ప్రవేశించాయి. దీంతో, ఇంజిన్లు ఆగిపోయి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతేజార్ గంజ్ సీఐ షుకూర్ పోలీస్ సిబ్బందితో నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులను యంత్రాల సహాయంతో బయటకు తీసుకువచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, రైల్వే అండర్‌బ్రిడ్జి కింద రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైల్వే అండర్‌బ్రిడ్జి వద్దే కాకుండా, శివనగర్తో సహా పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు మోకాళ్ళ లోతులో ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండిపోవడంతో అవి కనిపించక, ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ పరిణామాలు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మరోసారి చాటిచెప్పాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.