Khammam | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకూ పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా.. వాళ్లు మాత్రం మున్నేరు వరదల నుంచి దేవుడే ప్రజలను కాపాడాలని చేతులు ఎత్తివేశారని మండిపడుతున్నారు. తమను ఎవరు కాపాడుతారో తెలియక, రక్షించేవారికోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, బిల్డింగులపైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. తిండిలేక హహాకారాలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు గోదావరి, ఇటు మున్నేరు నదుల వరదల్లో చిక్కుకున్నట్టు వార్తలు వచ్చినా ముగ్గురు మంత్రులకు చీమకుట్టినట్టు కూడా లేదని జనాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిప్యూటీ సీఎం పర్యటన వర్షాల కారణంగా శనివారం సాయంత్రమే రద్దు కాగా.. ఆయన ఖమ్మంలోనే ఉన్నా ప్రజలను అప్రమత్తం చేయడంలో, యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పేరుకు రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లినా ఖమ్మం నగరాన్ని మాత్రం విస్మరించారు.
అవగాహన లేదు..అంచనా లేదు
రాష్ట్రంలో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా, ఖమ్మంలో అతి భారీ వర్షం కురిసినా ముందుగా ప్రభావితమయ్యేది మున్నేరు పరివాహక ప్రాంతమే. అటు ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్, ఇటు హైదరాబాద్‌వైపు వెళ్లే గ్రామాలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. గత పదేండ్లలో ఖమ్మంలో ఎప్పుడు భారీ వర్షం వచ్చినా మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజలు, అధికారులను అప్రమత్తం చేసేవారు. లోతట్టు ప్రాంతాలవారిని పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు. ముందుస్తు చర్యలు పకడ్బందీగా తీసుకునేవారు. ఇప్పుడు ముగ్గురు మంత్రులున్నా అరకొరగానే ముందస్తు ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారం నుంచి హెచ్చరిస్తున్నా వరదలపై అవగాహన లేక, ముందస్తు అంచనా లేక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌లోనే గడిపారు. తీరా ఇప్పుడు దేవుడిపైనే భారం వేశారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పొంగులేటి ఖమ్మం చేరుకొని, కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.