హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో విస్తృతంగా వానలు పడుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వచ్చే మూడు, నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీచేసింది.
నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన జంగయ్య(70) వంగూరు మండలం పోతారెడ్డిపల్లికి బయలుదేరాడు. రఘుపతిపేట శివారులో దుందుభీ వాగు దాటే క్రమంలో జారి నీళ్లల్లో పడ్డాడు. స్థానికులు గమనించి బయటకు తీసుకొచ్చేసరికి మృతి చెందాడు. భారీ వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య నక్కల ఒర్రె ఒక్కసారిగా ఉప్పొంగింది.
దీంతో 15 మంది కూలీలు చిక్కుకోగా మల్యాల గ్రామస్థులు తాళ్ల సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీలో వర్షాల కారణంగా రోజుకు 10 వేల టన్నులు, ఇందారం ఓసీపీలో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతున్నది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్ట్ (ఘనపూర్) ఆనకట్ట పొంగిపొర్లుతున్నది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. శనివారం ఉదయం 6 గంటలకు 31.3 అడుగులు ఉన్న గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ సాయంత్రానికి 35.2 అడుగులకు చేరింది. గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో అత్యధికంగా 7.36 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో 5.73 సెం.మీ, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో 5.68 సెం.మీ, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 5.68 సెం.మీ, రుద్రూర్ మండలంలో 5.46 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఆదివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.