నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిని అంచనా వేయక ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో వరద నీటిలో బస్సు చిక్కుకుంది.
అందులోని కొంతమంది ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ బయటకు రాగా మరి కొంతమందిని స్థానికుల సహకారంతో క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.