జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌కు(Medigadda barrage) భారీగా వరద(Heavy flood) వస్తున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ద్వారా బుధవారం 49,500 క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విదులుతున్నారు. ప్రవాహ తీవ్రతను భారీ నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రవాహ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అన్నారం బరాజ్ వద్ద నిలిచిన పరీక్షలు
భారీ వర్షం నేపథ్యంలో అన్నారం (సరస్వతి) బరాజ్ అప్ స్ట్రీమ్‌లో చేపట్టిన రెండో దశ జియో ఫిజికల్ పరీక్షలు బుధవారం నిలిచిపోయాయి. 29, 30వ గేట్ వద్ద పుణె నుంచి వచ్చిన సీడబ్ల్యూపీఆర్ఎస్ రెండో బృందం వారం రోజులుగా బోర్ వెల్ వేస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాన తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పరీక్షలు చేపడతామని ఇంజినీర్లు తెలిపారు.