హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి బలహీన పడిందని, దాంతోపాటు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఈ వానలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నది. ఆదివారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానకాలం సీజన్లో 50 రోజులు వానలు కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. 8 జిల్లాల్లో అత్యంత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 506.7 మి.మీ. కురవాల్సి ఉండగా 983.6 మి.మీ. అంటే 94% అధికంగా కురిసింది. నాగర్కర్నూల్ జిల్లాలో 320.3 మి.మీ.కు గాను 617.8 మి.మీ (93% అధికం), మహబూబ్నగర్లో 373.6 మి.మీ.కు 679.7 మి.మీ. (82% అధికం), యాదాద్రి-భువనగిరిలో 364.7 మి.మీ. గాను 659.8 మి.మీ. (81% అధికం), వనపర్తిలో సాధారణం 364.7 మి.మీ ఉండగా 659.8 మి.మీ. (74% అధికం), కామారెడ్డిలో 617.9 మి.మీ.కు 1038.1 మి.మీ. (68% అధికం) వర్షపాతం నమోదైంది. అదే విధంగా నారాయణపేట జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 356.2 మి.మీ. కురవాల్సి ఉండగా 586.2 మి.మీ. (65% అధికం) సిద్దిపేటలో సగటు సాధారణ వర్షపాతం 448.6 మి.మీ.కు 739.8 మి.మీ. (65% అధికం) చొప్పున నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
ఈ వానాకాలంలో రంగారెడ్డి జిల్లాలో 59%, సంగారెడ్డి 42%, సూర్యాపేట 40%, జోగులాంబ-గద్వాల 38%, నల్లగొండ 37%, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 34%, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 23% సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లా గాంధారిలో అత్యధికంగా 23.69 సెం.మీ, నిజామాబాద్ జిల్లా ములుగులో 21.08 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.