హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో సోమవారం జరిగిన సభ దద్దరిల్లింది. విద్యుత్తు రంగంపై మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి కలుగజేసుకొని జగదీశ్‌రెడ్డి వ్యక్తిగత ప్రస్తావన తీసుకొచ్చారు. అనంతరం జగదీశ్‌రెడ్డి అక్రమాలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డిని కోరారు. వెంటనే మైక్ అందుకున్న మంత్రి కోమటిరెడ్డి.. జగదీశ్‌రెడ్డిపై హత్య కేసులు, దొంగతనాలు, మద్యం కేసులు ఉన్నాయని దూషించారు. దీంతో సభంతా ఒక్కసారిగా ఆర్డర్ తప్పింది.
‘గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో ఏ2, భిక్షం అనే వ్యక్తి హత్య కేసులో ఏ6, తండ్రి ఏ7, రామిరెడ్డి హత్యకేసులో ఏ3గా జగదీశ్‌రెడ్డి ఉన్నాడు. దోసపాటి గోపాల్ అనే వ్యక్తి దగ్గర దొంగతనం చేసిం డు. మద్యం కేసులోనూ పట్టుబడ్డడు. ఈయ న గురించి మాట్లాడితే మా గౌరవం పోతుం ది’ అని మంత్రి అనగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోడియం వద్ద ఆందోళనకు దిగారు.
‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలను రికార్డు నుంచి తీసెయ్యాలి. ఆయన చెప్పిందాంట్లో ఒక్కటి రికార్డు చూపించినా, ఇదే సభలో ముక్కు నేలకు రాస్తా. రాజీనామా చేస్తా. లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రి రాజీనామా చేయాలి. ఒక్కటి నిరూపించలేకపోయినా ఇద్దరూ ముక్కు నేలకు రాయాలి. నేను రెడీగా ఉన్నా. ఈ చెత్తమాటలను రికార్డుల నుంచి తొలగించండి. లేదంటే నా సవాల్‌కు సిద్ధంగా ఉండాలి’ అంటూ జగదీశ్‌రెడ్డి దీటుగా సమాధానం ఇచ్చారు. ‘నేను ఆయన చాలెంజ్‌కు సిద్ధం. నేను నిరూపిస్తా. లేకపోతే మంత్రి పదవి అన్నీ వదిలేసి బయటికిపోతా. నల్లగొండ ఎస్పీ నుంచి రికార్డు తెప్పిచుకోండి. చాలెంజ్‌కు ఒప్పుకుంటున్నా’ అని కోమటిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు.
‘నాపై మూడు హత్య కేసులు ఈ కాంగ్రెస్ వాళ్లే పెట్టించారు. మూడు కేసుల్లోనూ కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది. ఇది కాకుండా ఉద్యమ కేసులున్నాయి. ఇవి కాకుండా ఇంకొక్క కేసున్నా. నా సవాల్‌ను స్వీకరించాలి. స్పీకర్ హౌస్ కమిటీ వేయాలి. మిగతా ఏ కేసును నిరూపించినా నేను నిల్చుదగ్గర్నుంచి స్పీకర్ చైర్ వరకూ ముక్కు నేలకు రాస్తా. లేకపోతే సీఎం, మంత్రి కోమటిరెడ్డి ఇద్దరూ రాజీనామా చేయాలి’ అంటూ జగదీశ్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
‘జగదీశ్‌రెడ్డి సబ్జెట్ డీవియేట్ చేయకుండా మాట్లాడాలి’ అని స్పీకర్ కోరడంతో ‘ఎవరు ఎవర్ని డీవియేట్చేస్తున్నారు? ఎవరు చేశారు? సీఎం రాకతోనే కదా ఇంత జరిగింది అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.