Group 1 Mains | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతకవలు జరిగాయంటూ హైకోర్టులో దాఖలైన 4 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా జరిగిందని, ఎంపిక చేసిన కొందరు అభ్యర్థులతో పథకం ప్రకారం 2 కేంద్రాల్లో పరీక్షలు రాయించారని పేర్కొన్నారు.
ఆ 2 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 563 మంది అభ్యర్థుల్లో ఏకంగా దాదాపు 10% మంది అర్హత సాధించారని తెలిపారు. హైదరాబాద్ కోఠి మహిళా కాలేజీలోని 18వ పరీక్షా కేంద్రంలో 5.41% మంది, అదే కళాశాలలోని 19వ పరీక్షా కేంద్రంలో 4.12% మంది అర్హత సాధించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని అన్నారు. ఒకే పరీక్షా కేంద్రంలో 4% మందికిపైగా అభ్యర్థులు, అదీ మహిళలు అర్హత సాధించడం గర్వకారణమని టీజీపీఎస్సీ చెప్తున్నదని ఆమె గుర్తుచేస్తూ.. ఇతర మహిళా కాలేజీల్లోని కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు పెద్దగా అర్హత సాధించకపోవడం, దాదాపు 40 ఇతర పరీక్షా కేంద్రాల్లో కనీసం ఒక్క అభ్యర్థి కూడా అర్హత సాధించకపోవడంపై టీజీపీఎస్సీ ఏం చెప్తుందని ప్రశ్నించారు.
ఐలమ్మ మహిళా విద్యాసంస్థ కాబట్టి అకడి పరీక్షా కేంద్రాల్లో మహిళలనే అనుమతించాలనే నిర్ణయం వివక్ష కిందకే వస్తుందన్నారు. బేగంపేటలోని మహిళా కాలేజీతోపాటు మరో 8 ఇతర మహిళా కాలేజీల్లో ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదో టీజీపీఎస్పీ చెప్పలేకపోతున్నదని తెలిపారు. అభ్యర్థుల కేటాయింపునకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించామని టీజీపీఎస్సీ చెప్తున్న మాట నిజమే అయితే మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఆ సాఫ్ట్వేర్ ఎలా సెంటర్లను కేటాయిస్తుందని ప్రశ్నించారు.
45 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం భద్రతను కోరుతూ పోలీసులకు లేఖ రాసిన అధికారులు.. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల సంఖ్యను 46కు ఎలా పెంచారని నిలదీశారు. ఎన్నో కేంద్రాల్లో ఆడ, మగ అభ్యర్థులు కలిసి పరీక్షలు రాశారని ఆమె గుర్తుచేస్తూ.. కోఠి కాలేజీలో నే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉన్నాయన్న కారణంతో అక్కడ మహిళలకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఆ అభ్యర్థులే భారీ సంఖ్యలో అర్హత పొందడం విస్తుగొలుపున్నదని తెలిపారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామన్న టీజీపీఎస్సీ చివరికి అలా చేయకపోవడంపై కనీసం వివరణ కూడా ఇవ్వలేకపోతున్నదని, దీని ఫలితంగా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను 3 రకాలుగా టీజీపీఎస్సీ ప్రకటించి అక్రమాలకు ఆసారం ఇచ్చిందని రచనారెడ్డి పేర్కొన్నారు. పరీక్షలు అవ్వగానే 21,075 మంది రాశారని, ఆ తర్వాత అన్ని కేంద్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని కోడ్రీకరిస్తే ఆ సంఖ్య 21,085కు పెరిగిందని ప్రకటించిన టీజీపీఎస్సీ.. మరోసారి మొత్తం 20,161 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్టు వెబ్సైట్లో పేర్కొన్నదని గుర్తుచేశారు.
ప్రతిష్ఠాత్మకమైన గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను టీజీపీఎస్సీ నిర్ధిష్టంగా చెప్పలేకపోవడం వెనుక జరిగిన బాగోతం ఏమిటో తేల్చాలని కోరారు. అక్రమాలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయలేదని స్పష్టం చేశారు. 21 వేల మందిని బయోమెట్రిక్ విధానంలో పరీక్షకు అనుమతించడం చాలా సులభమని, అభ్యర్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వస్తే ఆ పని చేయవచ్చని ఆమె పేర్కొంటూ.. నోటిఫికేషన్లోనూ బయోమెట్రిక్ అమలు గురించి ఉందని చెప్పారు.
గ్రూప్-1 మారుల జాబితాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్న నిబంధనను టీజీపీఎస్సీ ఎందుకు అమలు చేయలేదని రచనారెడ్డి ప్రశ్నించారు. వ్యక్తిగతంగా లాగిన్ అయిన అభ్యర్థులకు వారి మార్కులు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయడంలో ఔచిత్యం ఏమిటో బోధపడటం లేదని, అందరి మారులను అప్లోడ్ చేసి బహిరంగపరిస్తే ఎవరికి ఎన్ని మారులు వచ్చాయో, ఎవరు అర్హత పొందేందుకు దగ్గరగా వచ్చారో తెలిసి అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేదని పేర్కొన్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసినప్పుడు ప్రకటించిన మొత్తం మారులకు, సబ్జెక్టుల వారీగా ఉన్న మారులకు ఎందుకు పొంతన ఉండటం లేదని నిలదీశారు.
ఇలా ఒక అభ్యర్థికి 122 మారులు వచ్చినప్పటికీ 100 మార్కులే వచ్చినట్టు పేరొనడంపై ఆ అభ్యర్థి ప్రశ్నిస్తే.. తప్పుడు పత్రం సృష్టించారని, క్రిమినల్ కేసు పెడుతున్నామంటూ అధికారులు బెదిరించారని చెప్పారు. ఒక పేపర్‌ను రెండుసార్లు మూల్యాంకనం చేస్తారని, ఆ మూల్యాంకనంలో వేరువేరుగా ఇచ్చే మారుల్లో 15% వ్యత్యాసం ఉంటే టీజీపీఎస్సీ మూడోసారి మూల్యాంకనం చేయించాలన్న నిబంధన ఉన్నదని, మారులను ఓఎంఆర్ విధానంలో లెకించాలన్న నిబంధనను టీజీపీఎస్పీ అమలు చేయలేదని తప్పుపట్టారు. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ రాజేశ్వరరావు ప్రకటించారు. ఉద్యోగాల కోసం వేలమంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నందున శుక్రవారంతో వాదనలను ముగించాలని న్యాయవాదులకు సూచించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ఒక హాల్‌టికెట్, మెయిన్స్‌కు మరో హాల్‌టికెట్ ఇవ్వాల్సిన అగత్యం ఏమొచ్చిందని రచనారెడ్డి ప్రశ్నించారు. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్ నంబర్లను కేటాయించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఇంతకుముందు ఏ పరీక్షలోనూ ఇలా జరగలేదని ఆమె గుర్తుచేస్తూ.. కొంత మందికి లబ్ధి చేకూర్చేందుకే టీజీపీఎస్సీ ప్రత్యేక సెంటర్లను కేటాయించిందని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌ను మారుస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించకపోవడాన్ని, ఆ విషయాన్ని కనీసం తన అధికారిక వెబ్సైట్లో పెట్టకపోవడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. గ్రూప్-1లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాలతోపాటు అదనంగా ఏర్పడిన 60 ఖాళీలను కూడా భర్తీచేసే క్రమంలో టీజీపీఎస్సీ తొలి ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేసిందని, నిజానికి ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసి మరో నోటిఫికేషన్ జారీచేసే అధికారం టీజీపీఎస్సీకి లేదని వివరించారు.