హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వరకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థలు ఉన్నట్టు వెల్లడించారు. వీటిలో 80శాతం పట్టణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయని వివరించారు.
ఆహార వినియోగంలో కల్తీ, నాసిరకం పదార్థాల వాడకాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కల్తీ పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ‘ఈట్ రైట్ స్టే హెల్తీ’ సందేశాన్ని ఆచరిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం నేచుర్క్యూర్ దవాఖానలో నిర్వహించిన ఈట్రైట్ మేళాను ఆయన సందర్శించారు. ఆహార కల్తీ సమాచారాన్ని వెంటనే పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.