హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. వర్సిటీ భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారును నిలువరించేలా విద్యార్థులు లేవనెత్తిన ‘సేవ్ హెచ్‌సీయూ’ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. బయటకు వచ్చి విద్యార్థులు ఉద్యమిస్తుంటే, ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులు లాఠీచార్జికి దిగుతున్నారు. అయినా విద్యార్థులు తగ్గడం లేదు. పౌరసమాజం నుంచి వస్తున్న మద్దతు, దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రచారానికి యూనివర్సిటీ అధ్యాపకులు కూడా బుధవారం విద్యార్థులు ఉద్యమానికి గొంతు కలిపారు.
వర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమబాటలో భాగస్వాములయ్యారు. యూనివర్సిటీ బోధన సిబ్బంది సంఘాల ఆధ్వర్యంలో వారు ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమానికి మరింత బలాన్నిచ్చేలా అధ్యాపకులు పోరాటంలో మమేకం కావడంతో మరింత ఊపు వచ్చింది. హెచ్‌సీయూ అధ్యాపక సంఘం ఆధ్వర్యంలోనూ ప్రొఫెసర్లు యూనివర్శిటీలో గళమెత్తారు. హెచ్‌సీయూ అడవుల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నెలరోజుల వ్యవధిలో ఆ భూములను వర్సిటీకి బదిలీ చేయాలని స్పష్టంచేశారు.
400 ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నిర్వీర్యమైపోతున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. 2,340 ఎకరాల విస్తీర్ణంలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీలో ఇంచు భూమిని కూడా అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు అధ్యాపకులు స్పష్టంచేశారు. అరుదైన వన సంపదను, పక్షి, జంతుజాలాలను కాపాడుకుంటామని విద్యార్థులు, అధ్యాపకులు ప్రతినబూనారు. వర్శిటీ భూములను వదులుకునే ప్రసక్తే లేదని, గురువారం నుంచి బోధనేతర సిబ్బంది విద్యార్థులతో కలిసి ఉద్యమబాట పట్టనున్నది.
యూనివర్సిటీలోకి అక్రమంగా చొరబడి బుల్డోజర్లతో అడవులను తొలగించడమే కాకుండా, అడ్డుకుంటున్న విద్యార్థులపై లాఠీచార్జి చేసే హక్కు ఎవరిచ్చారు. పోలీసులు ఉన్నచోట మీడియాకు కూడా అనుమతివ్వాలి. అప్పుడే యూనివర్సిటీలో జరుగుతున్న ఘోరాలు బయటి ప్రపంచానికి కనిపిస్తాయి. మా క్యాంపస్‌లోకి మేము వెళ్లేందుకు ఐడీ కార్డులు చూపించాలంటున్నారు. మరి అనుమతులు లేకుండా పోలీసులు ఎందుకొచ్చారు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రశ్నించేందుకు విద్యార్థులు వెనుకాడరు. ఇప్పటికైనా పోలీసులు బుల్డోజర్లతో సహా యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లాలి. భూములను వెంటనే యూనివర్సిటీకి అప్పగించి, విద్యార్థులపై పెట్టిన కేసులను తొలగించి, వారిని వెంటనే విడుదల చేయాలి.
– ప్రజ్ఞ, విద్యార్థిని, హెచ్‌సీయూ
మా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న మాపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీచార్జి చేయడమేంటి? మేమేమైనా దొంగలమా? టెర్రరిస్టులమా? క్యాంపస్‌లోకి వందలాది మంది పోలీసులు చేరి అజమాయిషీ చేయడమేంటి? సీఎం రేవంత్‌రెడ్డి క్యాంపస్‌లోకి పోలీసులను, బుల్డోజర్ల పంపి అడవులను తొలగిస్తున్నారు. జీవవైవిధ్యానికి నిలయంగా ఉన్న యూనివర్సిటీని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. మా భూములను మాకు అప్పగించి వెళ్లిపోవాలి.
-శుక్ల, విద్యార్థి, హెచ్‌సీయూ
హెచ్‌సీయూ ఏర్పాటు కోసం నాటి ఇందిరాగాంధీ కేటాయించిన భూములను, ఆమె వారసులుగా చెప్పుకునే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి లాక్కోవాలనుకోవడం సిగ్గుచేటు. వర్సిటీకి కేటాయించిన భూములను కేవలం అకాడమిక్ సేవలకు మ్రాతమే ఉపయోగించాలి. ఎటువంటి కమర్షియల్, వ్యాపార సేవలకు వినియోగించరాదు. ఈ భూముల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, లా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లను ఏర్పాటు చేయండి. దానికి యూనివర్సిటీ సహకరిస్తుంది.
– ప్రొఫెసర్ పిల్లలమ్రరి రాములు, తెలుగు శాఖ అధ్యక్షుడు, హెచ్‌సీయూ
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను అమ్ముకునేందుకు యత్నిస్తున్నది. గతంలోనూ వర్సిటీ భూములలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేయగా మా విద్యార్థుల ఆందోళనలతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వ్యాపారం చేయాలనుకుంటున్నది. ఈ 400 ఎకరాల్లో ఆకుపచ్చని అడవులతోపాటు పెద్ద చెరువులు, అనేక రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు, అనేక ఔషధ మొక్కల జాతులు ఉన్నాయి. ఇప్పటికే నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారింది. ఈ 400 ఎకరాల్లో కమర్షియల్, వ్యాపారకార్యకలాపాలు చేపడితే కాలుష్యం మరింత పెరుగుతుంది. వర్సిటీ భూములను కేవలం అకడమిక్ సేవల కోసమే వినియోగించాలి.
– డాక్టర్ భంగ్య భూక్యా, అధ్యక్షుడు, హెచ్‌సీయూ టీచర్స్ యూనియన్(యూహెచ్‌టీఏ)