హైదరాబాద్, మే 22, (నమస్తే తెలంగాణ): ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భూమి కొనుగోలు చేశారన్న అభియోగాలపై కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేశారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రాజేందర్‌రెడ్డి (పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, మామ) దంపతులు 75ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో సిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి బాగోతం బట్టబయలైంది. ఈ స్థలాన్ని విదేశీ పౌరసత్వం ఉన్న ఝాన్సీరెడ్డి ఫెమా నిబంధనలు ఉల్లంఘించి కొన్నారని ఆరోపిస్తూ వర్ధన్నపేట, ఇల్లందు ప్రాంతానికి చెందిన దామోదర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఇటీవల ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేశారు. గతంలో భారతదేశ పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహారాల చట్టం ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం చట్ట రీత్యా నేరమని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపి భూమిని కొనుగోలు చేశారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఫెమా చట్టం ప్రకారం విదేశీ పౌరులు వ్యవసాయ భూము లు కొనుగోలు చేయడం నేరమని, గతంలో ఇలాంటి ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయని తెలిపారు.