హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోతున్నారో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్ యాక్ట్ సెక్షన్ 62 కింద సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయని, ఈ చర్యలను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. ఘోష్ నివేదికపై చర్యలు తీసుకున్నారా? చర్యలు తీసుకుంటారా?
చర్యలు తీసుకునే దశలో ఉన్నారా? ఏం చేయబోయేదీ తెలియజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదావేసింది. కమిషన్ విచారణ నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ వారిద్దరి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు కోరారు. సెక్షన్ 62 కింద సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నదని, మధ్యాహ్నం విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులను జారీచేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేరని, రేపు లేదా ఎల్లుండికి విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణ మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
సుందరం, శేషాద్రినాయుడు తమ వాదనలను కొనసాగిస్తూ.. సీఎం కక్షపూరిత ధోరణిలో ఉన్నారని చెప్పడానికి ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చే నిదర్శమన్నారు. ఎవరు సలహాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తప్పవని ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని ఏకపక్షంగా సీఎం ప్రకటించారని, ఈ మేరకు సభ తీర్మానం కూడా చేయలేదని చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనే నిర్ణయాన్ని సీఎం ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో తమ పిటిషన్లను అత్యవరంగా విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలన్నారు. లేకపోతే కేసు మొత్తం నిరర్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గత విచారణ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహారం ముందుకు సాగుతున్నదన్నారు. నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉంటాయని ఏజీ హామీ ఇచ్చారని, అసెంబ్లీ మాత్రం తీర్మానం చేయకుండానే ముగిసిందన్నారు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోకపోతే పిటిషనర్ల ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధాన పిటిషన్ అక్టోబర్ 7కి వాయిదా పడిందని, ఈలోగానే ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతున్నదన్నారు. చర్యలు ఉండబోవన్న దానికి భిన్నంగా చకచకా పావులు కదులుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకొని ‘ఇదంతా పిటిషనర్ల ఆందోళన మాత్రమే’ అని చెప్పింది.
దీనిపై న్యాయవాదులు స్పందిస్తూ.. అసెంబ్లీ చర్చ సమయంలో ‘సలహాలిస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, మీ నిర్ణయాలతో కూడా పనిలేదు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం ఖాయం’ అని సీఎం తేల్చి చెప్పారని, కాబట్టి తమ ఆందోళనకు అర్థం ఉందని బదులిచ్చారు. తమ అనుమానం ఆచరణలో పెట్టే ప్రమాదం ఉందన్నారు. ఇప్పడు ప్రభుత్వం నివేదికపై చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడం లేదన్నారు. శాసనసభలో సీఎం చెప్పిన విషయాలను ఇంగ్లీషులోకి తర్జమా చేసిన ప్రతులను న్యాయవాదులు అందజేయగా న్యాయమూర్తులు పరిశీలించారు. వాదనల తర్వాత ధర్మాసనం స్పందిస్తూ.. కమిషన్ నివేదికపై ప్రభుత్వ వైఖరి ఏమిటో మంగళవారం తెలియజేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తిరిగి న్యాయవాదులు కల్పించుకుని.. అప్పటి వరకు నివేదికపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 62 ప్రకారం సీబీఐ దర్యాప్తునకు జీవో వెలువడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. లేదా సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపాలని, అప్పటిలోగా ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని ఆదేశాలివ్వాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేరని, విచారణను మంగళవారం లేదా బుధవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో ప్రభుత్వ వివరణ తర్వాతే ఆదేశాలు ఇస్తామని పేర్కొంటూ వాయిదా వేశారు.