హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును కోరే అర్హత బీజేపీకి ఉన్నదో లేదో మంగళవారం తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసేలా తీర్పు వెలువరించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్‌రావు వాదిస్తూ.. క్రిమినల్ కేసులో నిందితులు కానివారికి రిట్ పిటిషన్ దాఖలు చేసే అర్హత లేదని, బీజేపీ వేసిన రిట్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన కేసులో నిందితులు రామచంద్రభారతి, కోరె నందకుమార్(నందు), సింహయాజిలపై బీజేపీకి అంత ఆసక్తి ఎందుకని ప్రశ్నించారు.
పోలీసు కేసు నమోదైన 24 గంటల్లోపే రిట్ దాఖలు చేయడం వెనుక బీజేపీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ నిందితులు ముగ్గురూ సంయుక్తంగా రిట్ దాఖలు చేసినందున నందు భార్య చిత్రలేఖ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె తరపున సీనియర్ న్యాయవాది ఉదయ్ హోళ్ల కోర్టుకు తెలిపారు. ఇందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
సీఎంపై వ్యక్తిగత ఆరోపణలను అనుమతించని హైకోర్టుఫోన్ల ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ తరఫు న్యాయవాది.. సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు అడ్డుకున్నది. ముఖ్యమంత్రిపై ఏ విధంగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తారని ప్రశ్నించింది. ఇంప్లీడ్ పిటిషన్‌ను ఇంకా అనుమతించలేదని గుర్తు చేసింది. వ్యక్తిగత ఆరోపణలు చేసే ప్రయత్నాలపై అసహనాన్ని వ్యక్తం చేసింది.