హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, ఆరెకటిక సమాజం ప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశానికే ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనవైపే ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు. ఒకవైపు అభివృద్ధి, మరొవైపు సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేరని తెలిపారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, గుండప్ప, ఉమాకాంత్ పాటిల్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే జహీరాబాద్ పురోగతి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జహీరాబాద్ ప్రాంతం పురోగతి సాధించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జహీరాబాద్ పట్టణాన్ని అన్నిరకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రైల్వే ఓవర్‌బ్రిడ్జి, రెవెన్యూ డివిజన్ కేంద్రం, నూతన మండలాలు, కొత్త విద్యుత్తు సబ్స్టేషన్లు, పలు రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు ఎన్నో చేసుకున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో జహీరాబాద్‌లో వారంలో రెండుసార్లు కూడా తాగునీరు వచ్చే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. కిలోమీటర్ దూరంలోనే ఉన్న కర్ణాటక ప్రజలకు అందుతున్న వసతీ, సౌకర్యాలు, మన రాష్ట్రంలోని పరిస్థితులపై జహీరాబాద్ ప్రాంతవాసులకే ఎక్కువగా తెలుసని పేర్కొన్నారు.