హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భూసార పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్‌లో రెండు రోజులు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. జీవితానికి సారవంతమైన మట్టి, స్వచ్ఛమైన గాలి, నీరే మూలాధారమని, వీటికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. దీనిపై ఎంపీ సంతోష్‌కుమార్ స్పందించారు. సద్గురు చెప్పినట్టుగా మన నిత్యజీవితంలో కొన్నింటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవని రీ ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను సీఎం కేసీఆర్ ఎంతో ముందే గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని, దీని ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. హరితహారం స్ఫూర్తితోనే తాను గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించినట్టు ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.