Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తామే తెచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, మన రాష్ట్రంలో ఈ పథకం అమలులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్‌కు సంబంధించిన 25% నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు. దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బంది పరిస్థితిని అర్థం చేసుకొని, తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకానికి సంబంధించి సెప్టెంబర్ 30లోపు యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ను కేంద్రానికి సమర్పించకపోతే రెండో విడత నిధుల విడుదల నిలిచిపోతుందని, ఇది తెలంగాణ ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన పంచాయతీరాజ్ నిధుల విడుదలలో జాప్యం, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదలలో ఆలస్యం కారణంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు హరీశ్‌రావు గురువారం బహిరంగ లేఖ రాశారు.
నిలిచిపోయిన గ్రామాల అభివృద్ధి
పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చామనే గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు.. సచివాలయం ముందున్న రాజీవ్‌గాంధీ విగ్రహం సాక్షిగా ఆ చట్టాలను తుంగలో తొకడం దారుణమని హరీశ్‌రావు విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో గ్రామాభివృద్ధి నిలిచిపోయిందని, పారిశుద్ధ్యం కుంటుపడిందని దుయ్యబట్టారు. గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాలుగా మురికికూపాలుగా మారాయని, చెత్తను తొలగించే ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని, కొన్నిచోట్ల అధికారులు అప్పులు చేసి డీజిల్ పోయిసున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చెయ్యలేక, ఆ ఆర్థిక భారాన్ని మోయలేక పంచాయతీ కార్యాదర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించిందని విమర్శించారు.
ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులకే కాదు.. పదవీకాలం ముగిసి నాలుగు నెలలైనా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సైతం ఎనిమిది నెలల గౌరవ వేతనాలు చెల్లించలేదని దుయ్యబట్టారు. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని మాజీ సర్పంచులు గవర్నర్‌ను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని, గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషిచేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్‌లో రాష్ర్టానికి హకుగా రావాల్సిన 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పాలన వ్యవసాయానికి సువర్ణ అధ్యాయం
‘ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1.. పత్తి ఉత్పత్తిలో నంబర్ 3.. పంటల సాగులో మేటి.. మన తెలంగాణ.. దేశానికే ఆదర్శం. ఇదంతా మంత్రమేస్తేనో, మాయ చేస్తేనో జరిగింది కాదు.. తొమ్మిదేండ్ల కేసీఆర్ కృషి, పట్టుదల, విజినరీ లీడర్షిప్ వల్ల సాధించిన ఘనత’ అని గురువారం ఎక్స్‌వేదికగా హరీశ్‌రావు ట్వీట్ చేశారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు.