
సిద్దిపేట, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ నిర్ణయాలతో రైతుబంధుగా మారితే, రైతుల నడ్డి విరిచే నిర్ణయాలతో కేంద్రం రాబందులా మారిందని అన్నారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ బీజేపీ సర్కారు నిత్యం ఏదో ఒక రైతు వ్యతిరేక విధానాన్ని ప్రకటిస్తూ రైతుల ఉసురు పోసుకొంటున్నదని ఆరోపించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్.. ఇలా అన్ని ధరలు పెంచి రైతులు వ్యవసాయాన్ని వీడేలా కేంద్రం కుట్ర చేస్తున్నదని, రైతులు వ్యవసాయం మానేస్తే కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పండుగ పూట ఎరువుల ధరలు పెంచి రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. ‘బృందాలుగా ఏర్పడి రైతులపై దాడిచేయాలని కిసాన్ మోర్చా సమావేశంలో హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పిలుపునిచ్చారు. తమ కార్యకర్తలను రైతులపైకి ఉసిగొల్పిన రైతు వ్యతిరేక పార్టీ బీజేపీ. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతుల మీదికి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు కారు ఎక్కించి చంపితే, ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ముమ్మాటికీ బీజేపీ నరహంతక పార్టీ’ అని మంత్రి హరీశ్ అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భారతీయ జూటా పార్టీ బీజేపీ రైతుల నడ్డి విరిచేలా పెట్టుబడి ఖర్చును రెండింతలు చేసిందని తెలిపారు. ఎరువుల ముడిసరుకు ధరలు పెరిగితే వాటిని భరించాల్సిన కేంద్రం.. తన బాధ్యతను విస్మరించి ఆ భారాన్ని రైతుల మీద మోపడం తగదని వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే కుదేలైన రైతాంగం ఈ భారాన్ని ఎలా మోయగలుగుతుంది? పెట్రో, డీజీల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచి రైతుల ఖర్చును కేంద్రం రెట్టింపు చేసింది. బాయికాడ, బోర్ల వద్ద విద్యుత్తు మీటర్లు పెట్టి రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం, పండిన పంటను అమ్ముకొనే మార్కెట్లను మూసేయడం, పండిన పంటను కొనబోమని తప్పించుకోవడం, ఇప్పుడు ఎరువుల ధరలు పెంచడం తప్ప ఈ ఏడేండ్లలో రైతులకు బీజేపీ ఏం చేసిందో సమాధానం చెప్పాలి’ అని మంత్రి డిమాండ్ చేశారు.
బీజేపీ పాలకుల కార్పొరేట్ కుట్రలను రైతులు గమనించి వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులంతా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి రైతుల హక్కులు కాపాడుకుందామని, ఈ రైతుహంతక బీజేపీని గద్దె దించుదామని అన్నారు. గల్లీలో అయినా, ఢిల్లీలో పోరాటానికైనా వెనుకాడేది లేదని.. ‘నాగలి ఎత్తుదాం.. రైతు పోరాట శక్తిని ఢిల్లీకి చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. ఎరువుల ధరలు తగ్గించే దాకా ఆందోళన సాగిస్తామని స్పష్టం చేశారు.