హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజీ సర్పంచులు, కార్యదర్శుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల సమస్యలు, పరిష్కారాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక)కు హరీశ్ ఆదివారం లేఖ రాశారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో భాగంగా 2019లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆదేశానుసారం పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధుల మంజూరు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారుల కృషివల్ల తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు భిన్నంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నిధుల్లేక పంచాయతీల అభివృద్ధి ఎకడికకడే నిలిచిపోయిందని హరీశ్ వాపోయారు. పారిశుద్ధ్యం పడకేసిందని, వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ టాక్స్ కట్టలేక అధికారులు వాటి తాళాలను ఉన్నతాధికారులకు అప్పగిస్తున్న దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఓవైపు అప్పులు పెరగటం, మరోవైపు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగి వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధుల విడుదల మరింత కష్టతరమవుతుందని బాధపడుతున్నారని తెలిపారు. మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని వివరించారు.
అభయహస్తం మ్యానిఫెస్టో హామీ ప్రకారం ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని హరీశ్ డిమాండ్ చేశారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్మికులలకు వేతనాలు వెంటనే చెల్లించాలని, నిరుడు నవంబర్లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.