హైదరాబాద్, జనవరి 27 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రికి లేఖ రాశారు. అనుమతులు సాధించడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం మేలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీని నిలువరించాలని కేంద్రమంత్రిని కోరారు. గోదావరి-కృష్ణా బోర్టుల అనుమతి తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించడంపై విస్మయం వ్యక్తంచేశారు.
ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రెండు లేఖలు రాయడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిరోజూ 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాజెక్టుల అనుమతులు పెండింగ్‌లో ఉండడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సీతమ్మ సాగర్‌కు టీఏసీ(టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) అనుమతులివ్వకుండా సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్‌కు ఎన్వోసీ జారీపై కేంద్రం జాప్యం చేయడం విడ్డూరమని పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల సాధనకు కిషన్‌రెడ్డి కృషి చేయాలని విన్నవించారు. కేసీఆర్ పాలనలో మిషన్‌కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణంతో సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. కానీ వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు టీఎంసీ నీరు ఎత్తిపోసే పథకానికి ఇప్పటివరకు అనుమతులు లభించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ పరిస్థితుల్లో కిషన్‌రెడ్డి గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.