Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘వరద పోయినా ఇంకా బాధితుల కన్నీళ్లు పారాలని ప్రభుత్వం చూస్తున్నదా? రేవంత్ రెడ్డి సర్కార్ ఇకనైనా నిర్లక్ష్యం వీడి వరద బాధితులకు తగిన సాయం చేయాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు చెల్లించాలని, ఇండ్లు కూలి, సామాన్లు నష్టపోయిన వారికి రూ. 2 లక్షలు, పూర్తిగా ఇండ్లు కూలినవారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు.
పంట నష్టం కింద ఎకరాకు రూ. 25వేలు అందించి మాట నిలుపుకోవాలని చెప్పారు. పశువులు నష్టపోయిన వారికి లక్ష సాయం , చిరువ్యాపారులకు రూ. 5లక్షల పరిహారంతో పాటు వడ్డీ లేని రుణాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ శనివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. భారీ వరదలతో ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారని, రూ.5,438 వేల కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
వారికి ఏం సమాధానం చెప్తరు?
వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభు త్వం విఫలమైందని హరీశ్ విమర్శించారు. ‘9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే కనీసం 9 మందిని కూడా కాపాడే నాయకుడే కరువయ్యాడని ఖమ్మండి జిల్లా ప్రజలు కన్నీటి పర్యంతమవుతూనే ఉన్నారు’ అని గుర్తుచేశారు. ప్రభుత్వ చేతగానితనంతో తమ వారిని కోల్పోయామని బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారని తెలిపారు. వరద విషాద పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ..
చేతులూపుతూ ర్యాలీ తీసిన దృశ్యాలు మరింత కుంగదీస్తున్నాయన్నబాధితుల ఆవేదనకు ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తక్షణ సాయం కింద ముందు రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పి ఆ తర్వాత నష్టం స్థాయిని బట్టి సాయం చేస్తామనిచెప్పడం బాధితుల్లో అయోమయాన్ని కలిగించిందని చెప్పారు. కట్టుబట్టలతో మిగిలిన వారికి ప్రభుత్వంతోపాటు స్థానిక మంత్రి పొంగులేటి కలిపి కేవలం రూ.16,500 అని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 15,096 మందిని రూ.16,500 సాయం అందించేందుకు గుర్తించి, రూ.18వేలు అందించేందుకు కేవలం 146 మందినే గుర్తించడంలో సర్కారు ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు పదిరోజుల్లోనే రైతులకు అందిస్తే కాంగ్రెస్ నానా యాగీచేసిందని, అధికారంలోకి రాగానే ఎకరానికి రూ.25 వేలు ఇస్తామని నాడు రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలోకి రాగానే మరోమాట చెప్పి ప్రజలను మోసం చేయటంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడని విమర్శించారు. మీడియా మేనేజ్మెంట్ను వీడి ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై దృష్టి సారించాలని హితవు పలికారు.