Harish Rao | సిద్దిపేట : పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణం విడుదల చేయాలి. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా(Siddipet) నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్(Oil palm crop) మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ రైతు నాగేదర్ మొదటి మొక్క నాతో నాటించారు.
ఇప్పుడు పంట కోత నా చేతుల మీదుగా జరుగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయిల్ పామ్ పంట అంటే చాల మంది రైతుల్లో అనుమానాలు ఉండేవి. ఖమ్మం సహా ఏపీలోని ప్రాంతాల్లో రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ఈ పంటను ప్రారంభించామన్నారు. ఆరుగాలం శ్రమించే రైతన్నకు లాభం చేయాలని కేసీఆర్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించారు.
పంటకు డ్రిప్ తో పాటు, ఎస్సీ ఎస్టీ లకు వంద శాతం సబ్సిడీ అందించారు. ఆ చర్యల ఫలితమే తెలంగాణ ఆయిల్ పామ్ సాగులో సాగులో అత్యధిక వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఆయిల్ పామ్ కు సిద్దిపేట హబ్ అవుతుందన్నారు. ఆయిల్ పామ్ రైతులకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాలో సుమారు 11 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహాన్ని అందించింది. ప్రభుత్వపరంగా అనేక రాయితీలు కల్పించి రైతులను ఆయిల్‌పామ్ సాగు చేసుకునే విధంగా అన్నిరకాలుగా ప్రోత్సాహకాలు అందించింది. మండల పరిధిలోని నర్మెటలో 65 ఎకరాల్లో రూ.300 కోట్ల వ్యయంతో ఫ్యాక్టరీ నిర్మించనుంది. పనులు సైతం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీమంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని సిద్దిపేట జిల్లాలో ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉండే ఆయిల్‌పామ్‌ను సాగుచేసేందుకు గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ప్రోత్సహించారు. దాని ఫలితంగా ఆదివారం ముందుగా వేసిన ఆయిల్‌పామ్ తోటల్లో తొలి ఆయిల్‌పామ్ గెలలను తీసే కార్యక్రమాన్ని అక్కెనపల్లి గ్రామంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు.
నంగునూరు మండలంలో మొత్తం 493 మంది రైతులు 1,669 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. ముందుగా అక్కెనపల్లిలో 26 మంది రైతులు సుమారు 168 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారు. గ్రామానికి చెందిన రైతు నాగేందర్ తోటలో తొలి గెలలు తీసేందుకు సిద్ధం చేశారు. ఈ మేరకు ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావు తొలి గెలలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 415 ఎకరాల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.