Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని.. రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్‌పై విచారించాలని డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి నాయక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్‌లోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని హరీశ్‌రావు నిలదీశారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
పోలీస్ అధికారులకు హరీష్ రావు వార్నింగ్
కావాలని రిటైర్మెంట్కు దగ్గర ఉన్న అధికారులతో SIT ఏర్పాటు చేసి మామల్ని ఇబ్బంది పెడుతున్నారు
ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, మీ సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టం
రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల… https://t.co/eKQyZubN8Y pic.twitter.com/5v4VFIHkQb
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026
కావాలనే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ (SIT) లో పెట్టి మా మీద ప్రయోగాలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. అంతకు అంత అనుభవిస్తారు.. జాగ్రత్తగా ఆలోచించుకోవాలని సూచించారు. రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టమని.. ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని హెచ్చరించారు. రేపు అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదని అన్నారు. మీ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అందుకే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.
దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్లో కాదు, చట్ట ప్రకారం వ్యవహరించాలని పోలీసులకు హరీశ్‌రావు హితవు పలికారు. తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. కుట్రలతో బీఆర్ఎస్ నాయకులను బెదిరించాలని చూస్తున్న రేవంత్ పన్నాగం ఇది అని వ్యాఖ్యానించారు. మేం తప్పు చేయలేదు, ఎవరికీ భయపడేది లేదని అందుకే కేటీఆర్ ధైర్యంగా వెళ్లారని స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం జరిగింది.. ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతీస్తే, కేటీఆర్ మీద సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయిస్తే ఏం చేశారని నిలదీశారు. రేవంత్ రెడ్డి మీద కూడా అధికారులు విచారణ జరిపించాలని.. అన్ని విషయాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.