యాదాద్రి భువనగిరి : రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి బాధ లేదన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో యూరియా, రైతు బంధు, సాగు నీరు, చివరికి పండిన పంటను అమ్ముకోవాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో వడ్లు కొంటున్నామని తెలిపారు. కానీ, సుమారు 24 రోజులు అవుతున్న వడ్లు కొనే దిక్కు లేదని స్థానిక రైతులు వాపోతున్నారని తెలిపారు. 43 డిగ్రీలో ఎండలకు రైతులు పిట్టలా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి ధాన్యం కొనడం చేతకావడం లేదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఉండి చెప్పడం కాదు.. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు.
మంచిర్యాల జిల్లాలో వర్షం ధాటికి ఒక గోడ కూలి ముగ్గురు రైతులు చనిపోయారు. నల్గొండ జిల్లాలో ఒక రైతు ధాన్యం కుప్పపై ప్రాణం వదిలాడు. అయినా ప్రభుత్వానికి చలనం లేకుపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఏం చేసారని రైతు వారోత్సవాలు జరుపుకుంటున్నారని నిలదీశారు. అకాల వర్షాలు, తుపాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఇప్పటికైనా మంత్రులు, అధికారులు మేల్కొని యుద్ధ ప్రాతిపకగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.