హైదరాబాద్: కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. మరోవైపు వాతావరణాన్ని సాకుగా చూపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన కామారెడ్డి (Kamareddy)పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తన పర్యటనను సీఎం వాయిదా వేసుకున్నారు. దీంతో తన నివాసంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరోవైపు మెదక్ జిల్లాలో ముంపు గ్రామాలలో స్థానిక నాయకులు, ఎమ్మెల్యే కొత్తప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో కలిసి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు. బుధవారం నుంచి జలదిగ్బంధంలో రాజాపేట, ధూప్ సింగ్ తండా వాసులను పరామర్శించనున్నారు.
భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలకు అధినేత ఫోన్లు చేసి ఈ మేరకు అప్రమత్తం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ దిశగా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అధినేత కేసీఆర్ సూచించారు.