కాళేశ్వరంపై కత్తిగట్టి, కర్షకులను గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై కేసీఆర్ కదనశంఖం పూరించనున్నారు. ఎగువనుంచి వరదనీరు వస్తున్నా, పొలాలను బీడు పెడుతున్న పాడుబుద్ధిపై జల కవాతు చేపట్టనున్నారు. గోదావరి నీళ్లు వృథాగా పోతున్నా.. మొద్దునిద్ర నటిస్తున్న సర్కారుపై లక్షలమందితో కదనయాత్రకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు.
ఇప్పటికే రెండు పంట సీజన్లను ఎండబెట్టిన రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం జారీచేసింది. వారంలోగా కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లివ్వకపోతే తామే కర్షకులతో కలిసివచ్చి మోటర్లు ఆన్ చేస్తామని హెచ్చరించింది.
హైదరాబాద్ జూలై6 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మరోవైపు కృష్ణాలో గడచిన 36 రోజులుగా వరద కొనసాగుతున్నా ఇప్పటికీ కల్వకుర్తి మోటర్లను ఆన్ చేయలేదని, నిరుడు కూడా ఇట్లనే నీళ్లను ఏపీకి వదిలిపెట్టి మహబూబ్‌నగర్‌లో క్రాప్ హాలిడే ప్రకటించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.కండ్ల ముందు నీళ్లున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘వారందాకా చూస్తం. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోస్తే సరి.. లేదంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి కదులుతాం..మోటర్లు ఆన్చేస్తం’ అని అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ సాగునీటి నిర్వహణలో సర్కా రు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
బీఆర్ఎస్పై బురదజల్లడంపైనే ధ్యాస
ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో మంచి వర్షాలు పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం లో మాత్రం దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని హరీశ్‌రావు వాపోయారు. సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో విత్తనాలు వేసినా మొలకెత్తే పరిస్థితి లేదని, చాలాచోట్ల నారుమడులు పోయా లా? వద్దా? అని రైతులు వెనుకాముందు ఆలోచిస్తున్నారని వివరించారు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటి సాగునీటికే కాకుండా తాగునీటికీ కటకట నెలకొనే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కానీ ఎగువ రాష్ర్టాల్లో మంచి వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి నదులకు జూలై, ఆగస్టులో రావాల్సిన వరదలు మే నుంచే మొదలయ్యాయని, మోటర్లను ఆన్ చేసి నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపుకోవచ్చని, మొదటి పంట సకాలంలో వేసుకోవడంతోపాటు, రెండు పంటలకు నీరందించే అవకాశమున్నదని తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూరాలకు నెల రోజుల నుంచి వరద వస్తున్నా మోటర్లను ఆన్చేయలేదని, రిజర్వాయర్లను నింపుకొనే సోయి సర్కారులో కరువైందని, కండ్ల ముందు నీళ్లు పోతున్నా గుడ్లప్పగించి చూస్తున్నదని నిప్పులు చెరిగారు.
కన్నెపల్లికి కదిలొస్తాం.. మోటర్లు ఆన్చేస్తాం
కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక భాగమని, ఆ బరాజ్‌లోని 80 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే అనవసర రాద్ధాంతం చేస్తూ మొత్తం ప్రాజెక్టును పడావు పెట్టడం దుర్మార్గమని హరీశ్ ధ్వజమెత్తారు. మేడిగడ్డ దగ్గర ఈ నిమిషానికి 73,600 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని వెల్లడించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మినిమం డ్రా డౌన్ లెవల్ 93.5 మీటర్లని, ప్రస్తుతం 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని, బరాజ్ గేట్లు తెరిచి ఉన్నా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని వెల్లడించారు. ఇది ఇంజినీర్లు చెప్తున్నదేనని వివరించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు ఫర్ఫెక్ట్గా ఉన్నట్టు మండలిలో కోదండరాం అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పారని గుర్తుచేశారు. మోటర్లను ఆన్‌చేస్తే రంగనాయక్‌సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్‌లో ఇలా రెడీగా ఉన్న రిజర్వాయర్లను నింపుకోవచ్చని తెలిపారు.
కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి మాదిరిగా అంతా సిద్ధంగా ఉన్నదని, బటన్ నొక్కితే చాలు ఎస్సారెస్పీ కింద 18 లక్షలు, మిడ్ మానేరు కింద లక్ష ఎకరాలు, కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు మొత్తంగా 15 జిల్లాల్లోని 21 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించుకొనే అవకాశం ఉన్నదని హరీశ్ వెల్లడించారు. ఎస్సారెస్పీ స్టేజ్-2 కింద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తితో పాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు నీరందించే అవకాశం ఉన్నదని, హైదరాబాద్ దాహార్తిని కూడా తీర్చవచ్చని స్పష్టం చేశారు. కానీ బీఆర్ఎస్పై కక్షతో కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం మోటర్లను ఆన్ చేయకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నదని ధ్వజమెత్తారు. సర్కారు నిర్వాకంతో రైతులు అరిగోసపడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇప్పటికైనా వెంటనే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి మొదటి పంటకు నీరందించాలి. అప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోం. లక్షలాది మందితో కదిలి వచ్చి మోటర్లు ఆన్చేస్తం. నీరందించి చూపుతం..ప్రజాబలం అంటే ఏమిటో చూపిస్తం’ అని హరీశ్ హెచ్చరించారు.
పాలమూరు బిడ్డనంటూనే పొట్టగొడుతున్నరు
గోదావరి జలాల్లో మాత్రమే కాకుండా కృష్ణా నీటిని సైతం రేవంత్ సర్కారు పూర్తిగా వినియోగించుకోవడం లేదని హరీశ్ నిప్పులు చెరిగారు. పాలమురు బిడ్డనని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ జిల్లా రైతులకు నీళ్లివ్వకుండా కడుపు కొడుతున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బీమా ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మే 28న జూరాలకు వరద వచ్చిందని, బీఆర్ఎస్ స్థానిక నాయకులు ప్రశ్నిస్తే జూన్ 12న ఒక మోటరు, జూన్ 25న ఒక మోటర్‌ను ప్రారంభించారని గుర్తుచేశారు. గతంలో జూరాలకు రేపు నీళ్లు వస్తాయంటే ఈ రోజే నీళ్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వాళ్లమని గుర్తుచేశారు. బీమాలో 20 రోజులు ఆలస్యంగా, కోయిల్‌సాగర్‌లో కూడా 15 రోజులు ఆలస్యంగా మోటర్లు ప్రారంభించారని మండిపడ్డారు. జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్‌కి గ్రావిటీ ద్వారా నీళ్లు పారుతాయని, కానీ వాటిని కూడా తీసుకోవడంలో రేవంత్‌రెడ్డి సర్కారు విఫలమైందని విమర్శించారు. అదేవిధంగా శ్రీశైలానికి వరద మే 30న ప్రారంభమైందని, జూలై 6 నాటికి 36 రోజులైనా ఇప్పటివరకు కల్వకుర్తి ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయలేదని మండిప్డడారు. నాటి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్వకుర్తి ప్రాజెక్టును పట్టించుకోకపోతే కేసీఆర్ వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబుకు పోయినసారిలాగా మళ్లీ కృష్ణలో నీళ్లను వదిలేస్తారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడ్డాక కృష్ణాలో అతి తకువగా అంటే 28 శాతం నీటి వాటానే వాడుకున్నది ఘనత వహించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వమేనని మండిపడ్డారు. చంద్రబాబు కోసం 65 టీఎంసీలను రేవంత్‌రెడ్డి ధారాదత్తం చేశారని విమర్శించారు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల పాలమూరులో క్రాప్ హాలిడే ప్రకటించి 65 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు వదిలి రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లించుకున్నారని మండిపడ్డారు. ‘కృష్ణా నీళ్లను ఆంధ్రాకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా? చంద్రబాబుతో మీకున్న చీకటి ఒప్పందం ఏమిటి రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి ఆంధ్రలో మూడో పంటకు నీళ్లు వదిలారని, ఈసారి కూడా ఆంధ్రాకు నీళ్లొదిలే ప్రయత్నం చేస్తున్నారని మండిప్డడారు. రైతులకు ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నా పాలమూరు జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. వస్తున్న వరదను మళ్లించి రిజర్వాయర్లు, చెరువులు నింపి రైతులకు నీరిచ్చే అవకాశం ఉన్నదని, తద్వారా 3లక్షల పదివేల ఎకరాల్లో పంట పండుతుందని, ఆ తెలివి ఈ ప్రభుత్వానికి లేదా? అని నిప్పులు చెరిగారు. కేసీఆర్ 10 లక్షల ఎకరాల మాగాణిగా పాలమూరు జిల్లాను మార్చారని, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, జూరాలను మోడ్రలైజేషన్ చేసి సాగునీరు అందించారని, పాలమూరు ప్రాజెక్టును సిద్ధం చేసి పెట్టారని చెప్పారు. తుదిదశ పనులను పూర్తిచేసి నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్ సర్కారుకు లేదని విమర్శించారు. వెంటనే కల్వకుర్తి మోటర్లు అన్ చేయకపోతే మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు, రైతులను తీసుకొని వెళ్లి మోటర్లు ప్రారంభిస్తారని చెప్పారు. ‘రైతులతో ప్రజా ఉద్యమానికి బయలుదేరుమంటారా? మోటర్లను మీరు ప్రారంభిస్తారా?’ అని హెచ్చరించారు.
పోలవరానికి ఓ నీతి..కాళేశ్వరానికి ఇంకో నీతా?
కాళేశ్వరంలోని మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఐదురోజుల్లోనే అగమేఘాలపై చేరుకొన్న ఎన్డీఎస్ఏ బృందం.. అదే గోదావరిపై పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి రూ. 2000 కోట్ల నష్టం జరిగినా ఎందుకు స్పందించడం లేదని హరీశ్ నిలదీశారు. ఎస్ఎల్బీసీ, సుంకిశాల కుప్పకూలినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంటే కాళేశ్వరానికి ఓ నీతి? పోలవరం, ఎస్ఎల్బీసీకి మరోనీతా? ఇదెక్కడి న్యాయం? ఇదేం దుర్మార్గం? అని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మైత్రి బంధంతోనే కాంగ్రెస్ సర్కారును బీజేపీ వెనకేసుకొస్తున్నదని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో కొట్లాడుతూ గల్లీలో చేతులు కలుపుతున్నాయని ఎద్దేవాచేశారు. ఎన్డీఎస్ఏ అసలు దేశం మొత్తం కోసం పనిచేస్తున్నదా? కేవలం కాళేశ్వరం కోసం పనిచేస్తున్నదా? అర్థంకావడంలేదని విమర్శించారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కూలిపోతే తిరిగి నిర్మిస్తున్నారని, కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి మేడిగడ్డకు రిపేర్ చేయించాలని, తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. అక్షయపాత్ర లాంటి కాళేశ్వరంపై కక్షగడితే తెలంగాణ చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు.
కేసీఆర్ ఆదేశం మేరకే ప్రెస్‌మీట్
వారం పది రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్చేయకపోతే కేసీఆర్ నేతృత్వంలో లక్షలాది రైతులతో కలిసి కదిలి వెళ్లి కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేస్తామని హరీశ్ హెచ్చరించారు. పరిస్థితి అంత తీవ్రరూపం దాల్చకముందే నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ఆదేశం మేరకే తాను ఈ ప్రెస్‌మీట్ పెట్టినట్టు తెలిపారు. తానే స్వయంగా నాయకత్వం వహించి అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులను కలుపుకొని వస్తానని, శనివారం తనను కలిసిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ చెప్పినట్టు హరీశ్ గుర్తుచేశారు. ‘వారంలో ఆన్ చేస్తేనేమో చేయండి.. లేదంటే రైతుల కోసం ఎంతదూరమైనా వెళ్తాం’ అని హెచ్చరించారు.
వరద జలాలను ఒడిసిపట్టకుండా బీఆర్ఎస్పై బురదజల్లుతూ ప్రభుత్వం, మంత్రులు పబ్బం గడుపుతున్నరు. కేసీఆర్‌పై కోపంతో, కడుపు మంటతో కరువును పారదోలే కల్పతరువు కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నరు. దుగ్ధతోనే ప్రాజెక్టును వదిలేసిండ్రు. మీకు మాపై కోపముంటే తీర్చుకోండి.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కానీ రైతులకు మాత్రం అన్యాయం చేయకండి.
-హరీశ్‌రావు
ఎగువ రాష్ర్టాల్లో మంచి వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి నదులకు జూలై, ఆగస్టులో రావాల్సిన వరదలు మే నెల నుంచే వస్తున్నయి. మోటర్లను ఆన్ చేసి చుక్కచుక్కనూ ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపుకొనే అవకాశం ఉన్నా కాంగ్రెస్ సర్కారు కావాలనే నీళ్లను వదిలిపెడుతున్నది. మొదటి పంట సకాలంలో వేసుకోవడంతోపాటు, రెండు పంటలకు నీరందించే అవకాశమున్నా గుడ్లప్పగించి చోద్యం చూస్తున్నది.. ఉద్దేశపూర్వకంగానే నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తున్నది.
–హరీశ్‌రావు
వ్యవసాయానికి ఎవరేం చేశారో.. చర్చిద్దామని సీఎం విసిరిన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించి ఈ నెల 8న చర్చిద్దాం రమ్మని ఆహ్వానిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం తప్పించుకొని ఢిల్లీకి వెళ్తున్నడు. బురదజల్లడం, తోక ముడవడం, తప్పించుకొని పారిపోవడం రేవంత్‌కు మొదటి నుంచీ అలవాటే.
-హరీశ్‌రావు
చెయ్యి నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్తే అవసరమున్న మందు ఇస్తాడు..కానీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మాత్రం చెయ్యి నొప్పితో వెళ్లిన వాడికి చికిత్స అందించకుండా అవయవాలు అన్ని పాడైనంక వైద్యం చేస్తామన్నట్టుగా ఉన్నది. అందుకే మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా 19 నెలలుగా కాలయాపన చేస్తున్నది.
-హరీశ్‌రావు
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దినచర్యలో భాగంగా ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయని చూసి.. అక్కడి నాయకులు, అధికారులను అప్రమత్తం చేసేవారు. ఫోన్లు చేసి చెరువులు నింపుకోవాలని పురమాయించేవారు. నీళ్ల విలువ తెలియనివాళ్లు ఈ రోజు పాలకులుగా ఉండటం వల్ల ప్రజలు గోస పడుతున్నరు. మేడిగడ్డ దగ్గర 73,600 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. కన్నెపల్లి పంప్‌హౌస్ మినిమం డ్రాడౌన్ లెవల్ 93.5 మీటర్లు కాగా 96 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నయ్. పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ బీఆర్ఎస్పై బురద చల్లుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నది.
-బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు