సంగారెడ్డి జూలై 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చీమూనెత్తురుంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా తనకు సవాల్ విసరడంతోపాటు వాట్సాప్‌లో లేఖ రాయడంపై హరీశ్‌రావు సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సొంత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో? కూడా తెలియని, చేతకాని మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? అన్న అంశంపై సాధికారక లెక్కలు సహా హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి జూపల్లికి సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా అక్కడికక్కడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికోట్లు అప్పులు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని అప్పులు చేసిందన్న అంశంపై స్పష్టత ఇచ్చే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు మాట్లాడిన వీడియోలు, ఆర్బీఐ పత్రాలు, లేఖను మంత్రికి వాట్సాప్ చేశారు. తన లేఖ చూసిన వెంటనే జూపల్లి స్పందించాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఎస్ఐఆర్పై బీఎల్ఏలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ఉండగానే హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి నుంచి వాట్సాప్‌లో లేఖ వచ్చింది. ఆ లేఖపై హరీశ్‌రావు అప్పటికప్పుడు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో మంత్రి జూపల్లికి స్ట్రాంగ్‌కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆగమాగం అయిన కాంగ్రెస్ పార్టీ డ్యామేజీ కంట్రోల్లో పడిందని ఎద్దేవా చేశారు. గోల్ చేద్దామనుకొన్న కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ చేసి పప్పులో కాలేసిందని చెప్పారు.
పీపీటీ ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి హరీశ్‌రావు సవివరంగా వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ఇప్పటివరకు రూ.1,77,058 కోట్ల అప్పులు చేసినట్టు జూపల్లి తనకు రాసిన లేఖలో పేర్కొన్నారని చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్ఎంబీ ద్వారా రూ.1,86,087 కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ విడుదల చేసిన ఎఫ్ఆర్ఎంబీ అప్పుల జాబితాను ప్రదర్శించారు. ఆర్బీఐ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం 175 సార్లు ఆ అప్పులు చేసిందని వివరించారు. ఈ వివరాలు ఆర్బీఐ వెబ్సైట్లో ఉన్నాయని తెలిపారు. మంత్రి జూపల్లి తనకు రాసిన లేఖలో రూ.10వేల కోట్ల అప్పులు తగ్గించి చూపారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిందో జూపల్లికి తెలియకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేసిన అప్పులపై అసెంబ్లీ వేదికగా తాను సీఎం రేవంత్‌రెడ్డిని మార్చి 18,2026న ప్రశ్నించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి 2026 వరకు రూ.3,47,294 కోట్ల అప్పులు చేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను హరీశ్‌రావు ప్రదర్శించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పటి వరకు రూ.4.50 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. లేఖ రాసిన అరగంటలోనే కాంగ్రెస్ చేసిన అప్పులపై జూపల్లి చెప్పిన లెక్కలు తప్పని ఆధారాలతో బయటపెట్టామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులకు ప్రభుత్వాన్ని నడుపరాక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నిలిపివేసిందని, వాటిని వెంటనే ప్రారంభించకపోతే జిల్లా రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీశ్‌రావు హెచ్చరించారు. ఆ పథకాల కోసం రైతులతో కలిసి తాను పాదయాత్ర చేస్తానని స్పష్టంచేశారు. 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఆ పథకాలకు కాంగ్రెస్ నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘బీఆర్ఎస్ పాలనలో తీసుకొన్న రుణాలు, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి చెల్లిస్తున్న రుణాలన్ని కలిపినా మొత్తం రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అప్పట్లోనే అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశాను. నేను చెప్పిన ఆ లెకలకు నేటికీ కట్టుబడి ఉన్నా. దీనిపై ఎకడైనా చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు శుక్రవారం రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. సంబంధిత వీడియోలు, ఆర్బీఐ అధికారిక గణాంకాలు తదితర ఆధారాలను జూపల్లి వాట్సాప్‌నకు పంపారు. ఆధారాలు సహా ఎన్నిసార్లు వివరించినా కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2026 ఫిబ్రవరి వరకు రూ.3,47,294 కోట్ల అప్పులు చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ కాంగ్రెస్ సర్కార్ చేసిన మొత్తం అప్పులు రూ.4.50 లక్షల కోట్లు దాటి ఉంటుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు మాత్రం రూ.1.77 కోట్లే ఆర్బీఐ ద్వారా సర్కార్ అప్పులు చేసిందని ఆయన నాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై నువ్వు చెప్పింది కరెక్టా? అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చెప్పింది కరెక్టా? జూపల్లి నిజంగా పాలమూరు బిడ్డవైతే, చీమూనెత్తురు ఉంటే తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీ, కార్పొరేషన్ల ద్వారా రూ.4.17 లక్షల కోట్ల అప్పులు చేసింది. అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో సైతం బీఆర్ఎస్ హయాంలో రూ.4.17 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పేర్కొన్నది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో బల్లగుద్ది లెక్కలు సహా పూసగుచ్చినట్టు నేను చెప్పాను. అప్పుడు కాంగ్రెస్ మంత్రులెవ్వరూ ఒక్కమాట మాట్లాడకుండా అందరూ ముఖాలు కిందికేశారు. ఆ లెక్కలు తప్పయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కాగ్‌కు ఎందుకు లేఖ రాయలేదు.
-బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత హరీశ్‌రావు