హనుమకొండ, జూన్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్ని వర్గాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పోవాలని, అందరి సంక్షేమం కోరే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రతి వర్గం కోరుకుంటున్నదనీ బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్దేనని, కాంగ్రెస్ పని ఖతమైందని వ్యాఖ్యానించారు. హిట్లర్ తనకు ఆదర్శమని ప్రకటించుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ నియంత హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని ధ్వజమెత్తారు. జూన్ సగం పూర్తయినా రాష్ట్రం ప్రభుత్వం రైతుల వద్ద వడ్లు కొనలేదని, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రికార్డు స్థాయిలో కొన్నట్టు అబద్ధపు ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం బీఆర్ఎస్ హనుమకొండ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో అవినీతి, సింగరేణిలో అవినీతి, హ్యామ్ రోడ్లలో.. ఇలా అన్నింటా రేవంత్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని విరుచుకుపడ్డారు. సింగరేణిలో బొగ్గు, సోలార్ పవర్, జిలెటిన్ స్టిక్స్ స్కాములపై తాను మాట్లాడితే ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. పైగా నాసిరకం బొగ్గు తెప్పించి మట్టికుప్పలపై పోసి మాయచేశారని నిప్పులు చెరిగారు.
రూ.1,600 కోట్ల విలువైన 40లక్షల టన్నుల బొగ్గు ఎకడుందో భట్టి విక్రమార చూపిస్తే తాను క్షమాపణ చెబుతానని, లేకుంటే ఆయన అవినీతి జరిగినట్టు అంగీకరించాలని సవాల్ చేశారు. సింగరేణిలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తాను లేఖ రాస్తే దొంగకు తాళం చెవి ఇచ్చినట్టు ఆయన చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అంటే విచారణ చేయాలని కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వడ్లు కొనడం చేత కావడంలేదని, జూన్ సగానికి వచ్చినా వడ్లు రైతుల వద్దనే ఉన్నాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ను మొలకెత్తనీయనని అంటున్న రేవంత్‌రెడ్డి.. మొలకెత్తిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చేస్తామనడం కాదు.. ముందుగా రైతుల వడ్ల లోడ్‌ను ఎత్తిచూపాలన్నారు. 75లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు రికార్డు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేపర్లలో ప్రకటనలు ఇచ్చారని, 2021లోనే కేసీఆర్ ప్రభుత్వం 92లక్షల టన్నులు కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. పశ్చిమ బెంగాల్లో 60 లక్షల ఓట్లు, తమిళనాడులో 40లక్షల ఓట్లు పోయాయని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు చురుగ్గా పాల్గొంటేనే త్వరలో జరుగబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంతా మంచి జరుగుతుందని ధీమావ్యక్తంచేశారు. బీఆర్ఎస్కు అనుకూల, కేసీఆర్ అభిమాన ఓట్లు పోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పలు సంక్షేమ పథకాల అమలుతో అనేక సామాజిక రుగ్మతలను దూరం చేసి సమాజంలో గొప్ప మార్పు తెచ్చారని హరీశ్‌రావు కొనియాడారు. ఆ పథకాల వెనుక కేసీఆర్ విజన్ ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రా చర్యలను ఎకడికకడ ఎండగడుతూనే ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల అండదండలతోనే ప్రజాక్షేత్రంలో అద్భుతంగా పోరాడుతున్నామని, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే పార్టీని కాపాడుకోవడమేనని, కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వడం అంటే పార్టీ భవిష్యత్‌కు బలమైన పునాది వేయడమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.